Friday 26 April 2019

బాధగా ఉంది మిత్రమా..!

బాధగా ఉంది మిత్రమా..! 
ఇన్నాళ్లూ ఏం సాధించామని? 
మనం పెంచి పోషించుకున్న 
పంతాలూపట్టింపుల బురదలో 
మోకాలిబట్టి లోతులో దిగబడి
కుళ్ళి తీపులు సలుపుతున్న కాళ్ళతో
ఇప్పటికీ భరిస్తూ నిల్చున్నామే..!
ఏ క్షణాన సుఖంగా ఉన్నామని మనం? 

భయంగా ఉంది మిత్రమా..! 
ఇన్నాళ్లూ ఏం కూడబెట్టామని? 
మన కమ్మటి స్నేహానికి మధ్యలో 
మనం ఒక్కో ఇటుకా పేర్చి 
పటిష్టంగా నిర్మించుకున్న 
విద్వేషపు గోడల నీడలో దాక్కుని
బాధ పైకి కనబడనీయకుండా 
ఇప్పటికీ కుమిలిపోతూ ఉన్నామే..! 
ఏ గడియన ధైర్యంగా నిద్రపోయామని మనం!? 

కంగారుగా ఉంది మిత్రమా..! 
ఇన్నాళ్లూ ఏం పొందామని? 
మన మధ్య అపార్థం తలెత్తినపుడు
నిప్పులు కురిపించే కళ్ళతో నీవూ
నెత్తురు మరిగించే చూపులతో నేనూ
ఏం జరిగిందో వినే ప్రయత్నమేదీ చేయక
ఎవరికీ మాట్లాడే అవకాశమైనా ఇచ్చుకోక
పొత్తును చీల్చుకుంటూ 
విసురుకున్న నిశ్శబ్దపు హోరును
ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉన్నామే..! 
ఏ పూట హాయిగా భోజనం చేశామని మనం?! 

గుండె బరువెక్కిపోతోంది మిత్రమా..! 
ఇన్నాళ్లూ ఏం గెలిచామని? 
మనం చివరిసారిగా ఎదురుపడ్డ క్షణం 
నీ కళ్ళల్లోకి సూటిగా చూడలేక నేనూ
నా ఎదుటన కుదురుగా నిలబడలేక నీవూ
ముఖాలు తిప్పుకుని
వెనక్కి తిరిగి చూడకుండా 
మనమేదో ఆగర్భ శత్రువులమైనట్టు
దించలేని కొండంత పగనేదో 
నెత్తిన పెట్టుకుని మోసేస్తున్నట్టు
చెరో దారిన వెళ్ళిపోయామే! 
ఏ రోజున నిజాయితీగా నవ్వగలిగామని మనం? 

కన్నీరు ఆగడంలేదు మిత్రమా! 
ఇన్నాళ్లూ ఎలా ఉండగలిగామని? 
నాకు దూరంగా నువ్వూ
నీకు దూరంగా నేనూ
ఒకరినొకరు తలచుకుంటూ
మాటిమాటికీ మెసేజ్ టైప్ చేసి చెరిపేస్తూ
నంబర్ సేవ్ చేసి... డిలిట్ చేస్తూ
మనసు ముక్కలు చేసుకుని
మరలా మరలా అతికించుకుంటున్నామే! 
ఎంతకాలం మిత్రమా ఇలా భ్రమలతో బ్రతికేయడం?! 

ధైర్యం సరిపోవడం లేదు మిత్రమా.! 
ఇప్పుడెక్కడున్నావో.. తెలుసుకోవాలనుంది
ఎలా ఉన్నావో... చూడాలనుంది
ఏం చేస్తున్నావో... అడగాలనుంది
నువ్వు నోరారా నన్ను పిలిస్తే.. వినాలనుంది
నిన్ను మనసారా గుండెలకు.. హత్తుకోవాలనుంది
ఏ నిమిషమేమౌనో..! మనసుకొకటే దిగులు
తొలిచి తొలిచీ మదిన గిలి ముసురుకుంటోంది
ఇన్నాళ్ల ఎడబాటు ఒకసారి తుడిచేసి
క్షేమంగ ఉన్నట్లు ఒకమాట చెప్పవా..!
ఈ హృదయవేగాన్ని సంతృప్తి పరచవా.!! 

-మల్లికావల్లభ పిట్ల

సాగిపో చలో చలో

పల్లవి :
సాగిపో చలో చలో.!
నువ్ కన్న కలలదారిలో..!!
సాహసీ తెగించి సాగరా 
నీ పథం సవాలురా 
క్షణం కూడా ఎంతో ఖరీదురా
సాగిపో చలో చలో.!
నువ్ కన్న కలలదారిలో..!! 

చరణం : 1
ధైర్యమే ఊపిరి 
అంతకన్నా తోడులేదురా
గమ్యమే ముళ్లదారి
ఆచి తూచి అడుగులేయరా
దాటెయ్యరా ముళ్లని
భావించి పూలబాటని
ఎడారి ఎండమావులు గులాబి నందనాలుగా
సాగిపో చలో చలో .!
నువ్ కన్న కలలదారిలో..!!

చరణం : 2
కాలమే మాయదారి 
కష్టమంటూ జంకిపోకురా
జిందగీ పొంగే ఝరీ
గడియ గడియ మలుపులేనురా
దూరమున్న తీరమే
దూసుకెళ్తే దగ్గరౌనురా
చీకటొచ్చి పడితే నింగి కుంగుతుందా? 
వెలుగు ఆగుతుందా? ఉషస్సు దాగుతుందా? 
సాగిపో చలో చలో.!
నువ్ కన్న కలలదారిలో..!!

సాగిపోరా వీరా శ్రమించి ముందుకు
అడుగు దూరమైన లేదు నీకూ-గెలుపుకు
తరుముకుంటూ పోరా వెనక్కి తగ్గక
ఓటమే ఓడిపోద్దిరా..... 
గెలుపు నీకు సొంతమౌనురా
గెలుపు నీకు సొంతమౌనురా
సాగిపో చలో చలో.!
నువ్ కన్న కలలదారిలో..!!


రచన : మల్లికావల్లభ పిట్ల
సంగీతం : ఆర్యన్ భౌమిక్
గానం : రాజ్

Monday 20 February 2017

మానవతను వెతకండి


ఎవరూ ఇటు రారు తడియారిన నా గొంతును తడపడానికి
ఎవరున్నారు అయ్యోపాపం అంటూ చూడడానికి..?
చచ్చిబ్రతికి కన్నానుగా...వదిలేసారు 

రెక్కలకష్టాన్ని పీల్చి రోడ్డున విసిరేశారు
వచ్చేవారయితే సగం చంపి వెళ్ళరు...
ఏ చప్పుడు వింటున్నా "అమ్మా" అన్నట్లుంది
మనవళ్ళు మనవరాళ్ళ పిలుపులు విన్నట్లుంది
ఇంకెవరొస్తారు గుండెలపై ఊకొడుతూ కథలను వినడానికి..?
కళ్ళు మూయలేనంత దుమ్ము చేరిపోయింది
కుక్కలు పోట్లాడుకుంటూ మీదికొచ్చిపడుతున్నవి
కప్పలకిక లెక్కలేక పైపైకొస్తున్నాయి
ఎంగిటి విస్తళ్ళు నన్ను దాటుకుపోతున్నాయి
ఏ ఒక్క మెతుకైనా జారి నోటపడబోదే..!
ఆకలి రోజుల తరబడి పేగులనలిమేస్తోంది
వదిలిన మలమూత్రాలతో బట్టలు తడిసున్నాయి
రాత్రంతా చలికి వణికి పగలు ఎండి ఒళ్ళు చిట్లి
శరీరమంతా పుండై తీపులు పెడుతూవుంది
చీమలు కుడుతున్నానూ కదలలేని దుస్థితి
ఎవరికి చెప్పాలి నేను బ్రతికే ఉన్నానని..?
 ఎవరెవరో ఈ దారిన వస్తూ పోతున్నారు
కళ్ళున్నా ఇటు చూడక గుళ్ళొకెళ్తున్నారు
చావురాక బ్రతకలేక ఊపిరితో ఇక్కడ
కదలలేని రాతిబొమ్మ వేడుకతో అక్కడ
ఇంకెవరూ రారు కడసారి చూసి కంట నీరుకార్చడానికి..
ఎండిన పెదవుల మధ్యన నాలుక పడి రాకుంది
పిడుగులు పడ్డట్లు చెవులు గుప్పుగుప్పుమంటున్నవి
ఒంట్లో ఒక్కోనరమూ జివ్వున లాగేస్తోంది
ఎవరో నా గొంతుపట్టి నొక్కేస్తున్నట్లుంది
తెలియని బరువేదో నా గుండెలనదిమేస్తోంది...
అదిగో నా కళ్ళచుట్టూ చీకటి కమ్మేసింది
ఊపిరాగిపోతోంధిక ఎవరూ ఇటురాకండి
నా బిడ్డలు ఎదురొస్తే మీతో తీసుకుపోండి
ఎక్కడ దాచారో కలిసి మానవతను వెతకండి.